సమస్య మీది… పరిష్కారం మాది…

చట్టపరిధి అంశాలయితే ఓకె

‘ఠాణా’ దివస్ ప్రోగ్రాం

దిశ దశ, రాజన్న సిరిసిల్ల జిల్లా:

జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో కూర్చొని వచ్చిన వారి సమస్యలు వింటు కాలం వెల్లదీయడం ఆ అధికారికి అంతగా నచ్చనట్టుంది. ఇండియన్ పోలీస్ సర్విసెస్ చేసింది ప్రజా సేవ కోసమే కదా… పేదోళ్లను అక్కున చేర్చుకోవడమే తన విధి కదా అన్న విషయం ఆయన మదిని తొలుస్తోంది. అంతే తన ఆలోచనలతో ప్రజా క్షేత్రంలో ఉండాలని నిర్ణయించుకుని ఈ మేరకు కార్యరంగంలోకి దూకారు ఆ ఎస్పీ. దూరంగా ఉండాలని చెప్పే గన్ మెన్లు ఆయన సమీపంలో కానరారు… ప్రతి ఒక్కరి సమాధానం ఓపిగ్గా వింటూ పరిష్కారం చూపుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వినూత్నంగా ప్రారంభించిన ‘ఠాణా దివస్’ కార్యక్రమం మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఠాణా దివస్ లో భాగంగా వేసిన తొలి అడుగులోనే 50 మంది తమ గోడు వెల్లబోసుకునేందుకు వచ్చారు. ఒక్కో పిటిషనర్ ప్రత్యేకంగా మాట్లాడిన ఎస్పీ వారి సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకున్నారు. సరికొత్త ఆలోచనలతో చేపట్టిన ఈ కార్యక్రమంలో నేర సంబంధిత అంశాలతో పాటు కుటుంబ తగాదాలు, భూ సమస్యలు ఇతరాత్ర శాఖలకు చెందిన అసంపూర్తి పనుల గురించి బాధితులు ఎస్సీకి వివరించారు. వారందరితో వ్యక్తిగతంగా మాట్లాడిన ఎస్పీ చట్టపరిధిలోని అంశాలను పరిష్కరిస్తామని సివిల్ విషయాలు అయితే కోర్టుకు వెళ్లాలని సూచించారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసమే: ఎస్పీ అఖిల్ మహాజన్

నా కార్యాలయానికే పరిమితమై నా వద్దకు వచ్చే వారి సమస్యలు వినడం సరికాదని భావించాను. ప్రజల వద్దకే వెల్లి వారి అవసరాలను తీర్చే ప్రయత్నం చేస్తే బావుంటుందనుకున్నాను. అందుకే ప్రతి నెల మొదటి మంగళవారం నాడు ఒక పోలీస్ స్టేషన్ లో ఉండి నేరుగా ప్రజలను కలవాలని నిర్ణయించుకున్నాను. ఈ మేరకు అవసరమైన కార్యాచరణ రూపొందించి ప్రజలతో మమేకం అవుతున్నాను. చట్టపరిధిలోని అంశాలు మా విభాగం పరిధిలోనివి అయితే వాటిని వెంటనే పరిష్కరించేందుకు ఆదేశాలు ఇవ్వడం, ఇతర శాఖలకు చెందినవి అయితే కలెక్టర్ కు పంపించాలని నిర్ణయించాం. అయితే ఠాణా దివస్ ప్రోగ్రాంలో వచ్చే పిటిషన్లపై సపరేట్ గా మానిటరింగ్ చేయడంతో పాటు ఇందుకు ప్రత్యేకంగా ఓ రిజిస్టర్ కూడా మెయింటైన్ చేస్తూ వినతి పత్రాలు ఇచ్చినవారితో కోఆర్డినేట్ అవుతుంటాం. దీనివల్ల దరఖాస్తు చేసుకున్న వారికి కూడా వారి సమస్య పరిష్కారం అయిందా లేదా అన్న విషయం కూడా ఎప్పటికప్పుడు తెలిసిపోతుందని అనుకుంటున్నాను.

రెండు దశాబ్దాల తరువాత…

రెండు దశాబ్దాల క్రితం పీపుల్స్ వార్ ప్రభావిత జిల్లాలో ప్రజలతో మమేకం అయ్యేందుకు పోలీసు అధికారులు ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేవారు. నక్సల్స్ కార్యకలాపాలను అణిచివేయాలంటే ప్రజల మధ్యన ఉండాలన్న విషయాన్ని గమనించిన అప్పటి పోలీసు అధికారులు ఊరు, వాడ కలియతిరిగేవారు. నక్సల్స్ కు పెట్టని కోటగా ఉన్న పల్లెలను సైతం చుట్టిముట్టి వచ్చేవారు ఆ నాడు పనిచేసిన ఎస్పీలు. దీనివల్ల నక్సల్స్ కార్యకలాపాలు తగ్గుముఖం పడతాయన్న కోణంతో వారు వ్యూహాత్మకంగా వెల్లేవారు. ఇలా ప్రజల్లోకి వెల్లినప్పుడు పోలీసు అధికారులకు తమ విభాగానికి సంబంధించని పిటిషన్లు వచ్చేవి. అందులో బస్సు సౌకర్యం కల్పించాలని, రోడ్డు వేయించాలని, స్కూల్ ఏర్పాటు చేయించాలని, టెలిఫోన్ ఎక్ఛేంజీ కావాలంటూ ఇలా వివిధ శాఖలకు సంబందించిన పిటిషన్లు ఎక్కువ సంఖ్యలో అప్పటి పోలీసు అధికారులు ప్రజల నుండి తీసుకునే వారు. అయితే ఇప్పుడు కూడా ‘ఠాణా దివస్’లో పోలీసు విభాగంతో సంబంధంలేని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దరఖాస్తులు రావడం గమనార్హం. ఆనాడు నక్సల్స్ కార్యకలాపాల వల్ల ప్రభుత్వ ఆస్థులు ధ్వంసం అవుతాయన్న కారణంతో పోలీసుల నుండి అభ్యర్థించేవారన్న అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు కూడా పోలీసు శాఖకు సంబంధించని అంశాలపై దరఖాస్తులు రావడం గమనార్హం.

You cannot copy content of this page