క్యాబ్ డ్రైవర్ల ఆందోళన సరే… తెలంగాణా వారి పట్ట వివక్ష ఏల మరీ..?

దిశ దశ, హైదరాబాద్:

హైదరాబాద్ నగరంలో సెటిలయిన క్యాబ్ డ్రైవర్ల వల్ల ఉపాధి కోల్పోతున్నామని తెలంగాణ వాసులు ఆందోళన చేస్తుంటే స్పందిస్తున్న ఏపీ పెద్దలు… తెలంగాణ వాసుల పట్ల చూపిస్తున్న వివక్ష గురించి పట్టించుకోకపోవడం విస్మయం కల్గిస్తోంది. ఈ నెల 15న నిరసన చేపట్టాలని తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీకి చెందిన క్యాబ్ డ్రైవర్లకు అనుకూలంగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా వేలాది మంది డ్రైవర్లు ఉపాధి లేకుండా పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణాలో ఉన్న ఏకైక ఎయిర్ పోర్టుకు వచ్చివెల్లే జాతీయ, అంతర్జాతీయ ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చే విషయంలో ఏపీ క్యాబ్ డ్రైవర్ల వల్ల తాము ఉపాధి కోల్పోతున్నామని ఇక్కడి వారు అంటున్నారు. తమకు న్యాయం చేయాలని కూడా వారు అభ్యర్థిస్తున్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా సీమాంధ్ర వాసులు హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్న వారు కోకొల్లలు. ఏపీ ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్య మంత్రులు ఉప ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు, ప్రస్తుత మంత్రులు, పారిశ్రామిక వేత్తలు కూడా హైదరాబాద్ లోనే నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. సాఫ్ట్ వేర్ రంగంతో వ్యాపార, వాణిజ్య రంగాల్లో మహానగరంలో సెటిల్ అయిన వారి సంఖ్య చెప్పనక్కర్లేదు. కర్రీ పాయింట్ నుండి మొదలు పెడితే క్యాప్టిలిస్టు వరకు సీమాంధ్రులు భాగ్యనగరంలో నివసిస్తున్నారు. ఎల్ బి నగర్, దిల్ సుఖ్ నగర్, వనస్థలి పురం, కూకట్ పల్లి, గచ్చిబౌళి ఇలా చెప్పుకుంటూ పోతే సీమాంధ్రుల ఉనికి అసలే లేని ప్రాంతాలను బూతద్దంలో పెట్టి వెతకాల్సిందే. తమకు అన్నింటా అన్యాయం జరుగుతోందన్న కారణంతోనే తెలంగాణ వాసులు స్వరాష్ట్రం కోసం గళమెత్తి నినదించారు. అయితే ఇప్పుడు క్యాబ్ డ్రైవర్ల రూపంలో వ్యతిరేకత మొదలు కాగానే ఏపీ ప్రభుత్వానికి చెందిన వారు స్పందిస్తున్న తీరు తమ రాష్ట్రానికి చెందిన వారిని కాపాడుకునే విధంగా ఉంది తప్ప తెలంగాణ వాసులు కష్టాలను తీర్చేవిధంగా మాత్రం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. విడిపోయినా అన్నదమ్ముల్లలా కలిసి ఉంటామని ఉద్యమ సమయంలో  నేతలు పదే పదే చెప్పినా కూడా ఇష్టారీతిన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఎన్నెన్నో. స్వరాష్ట్ర కల సాకారం అయి పదేళ్లు కాగా… ఇప్పుడిప్పుడే స్వపరిపాలనతో ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటున్న పరిస్థితులు తయారయ్యాయి. ఇక్కడి వనరులను ఉపయోగించుకుని జీవనం సాగించాలన్న ఆకాంక్షతో ఉన్న స్థానికుల స్థితిగతుల గురించి పట్టించుకోకుండా ఏపీకి చెందిన వారు వ్యవహరిస్తున్నారు. తెలంగాణ నుండి వేల సంఖ్యలో సీమాంధ్ర ప్రాంతానికి వచ్చి సెటిల్ అయి ఉన్నట్టయితే ఇదే స్పందన వారి నుండి వచ్చేదా అన్న విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. గో బ్యాక్ తెలంగాణ వాసులారా అన్న నినాదాన్ని గొంతు చించుకుని నినదించే పరిస్థితి ఖచ్చితంగా వచ్చేది. కానీ ఇప్పుడు తెలంగాణ వాసుల నుండి ఎదరవుతున్న వ్యతిరేకత కాబట్టి తమవారికి అనుకూలంగా మాట్లాడుతున్నారన్న చర్చ తెలంగాణలో బలంగా సాగుతోంది.

భక్తి విషయంలోనే వివక్ష…

భారతదేశంలోనే అత్యంత అరుదైన ఆలయంగా ప్రసిద్ది గాంచిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెలంగాణ వారికి ఈ పదేళ్లలో ప్రత్యేకంగా దర్శనాలు చేసుకునే అవకాశం కల్పించారా..? చట్ట సభలకు ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర ప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించారా..? లోకసభ, రాజ్యసభలకు ప్రాతినిథ్యం వహిస్తున్న వారి లేఖలపై కూడా నియంత్రణ పెట్టిన విషయాలు ఎందుకు మర్చిపోతున్నారు. వీకెండ్స్ లో అయితే తెలంగాణ రికమండేషన్ లెటర్స్ కు నో అని చెప్పింది  వ్యవహరించింది నిజం కాదా. టీడీపీ ప్రభుత్వం మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పుడు తెలంగాణ వాసులకు కూడా బోర్డులో ప్రాతినిథ్యం కల్పించినప్పటికీ వారికి ఇచ్చిన ప్రయారిటీ ఎంత..? ఏపీకి చెందిన ఎమ్మెల్యే ఎల్ 1, ఎల్ 2, వీఐపీ బ్రేక్ తో పాటు అర్జిత సేవలకు సంబంధించిన సిఫార్సు లేఖలకు టీటీడీ ఇచ్చిన ప్రాధాన్యతలో తెలంగాణ నుండి టీటీడీ ట్రస్టు బోర్డులో ప్రాతినిథ్యం వహించిన వారికి ఆ స్థాయి ప్రాధాన్యం అయినా ఇచ్చారా..? ఆలయ ట్రస్టీలుగా ఉన్న వారి పట్ల కూడా వివక్ష చూపిన సందర్భాలు ఎన్నో ఉన్నా కూడా తెలంగాణ వాసులు కిమ్మనలేదు కదా. తెలంగాణ ప్రాంత ట్రస్టు బోర్డు మెంబర్ల లేఖలు తీసుకెళ్లిన వారికి ఇచ్చిన గెస్ట్ హౌజుల విషయంలో కూడా వివక్ష చూపించింది వాస్తవం కాదా.  మొన్నటికి మొన్న డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలు అనుమతించేది లేదని ఈఓ స్ఫష్టం చేసిన సంగతి మరవద్దు. దైవ దర్శనం విషయంలోనే తెలంగాణ వాసులపై ఇంతలా వివక్ష చూపిస్తున్నారంటే మిగతా విషయాల్లో ఏ స్థాయిలో ఏపీ నుండి వ్యతిరేకత వచ్చేదో అర్థం చేసుకోవచ్చు. కానీ హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్లు ఆందోళన చేస్తే మాత్రం చొరవ తీసుకుని మాట్లాడుతున్నారు… వారికి అన్యాయం జరగొద్దని వ్యాఖ్యానిస్తున్నారు అక్కడి నేతలు. ఏపీ పొలిటికల్ లీడర్లు వ్యవహరిస్తున్న తీరు సహేతుకంగా ఉందా అన్నది వారే ఆలోచించుకోవల్సిన అవసరం ఉంది. పదేళ్ల పాటు జాయింట్ క్యాపిటల్ అన్న నిబంధనతో లాభపడిందెవరూ..? తెలంగాణా వారా..? ఏపీకి చెందిన వారా అన్న విషయంపై నేతలు గుండెలపై చేతులు వేసుకుని ఆలోచించుకోవల్సిన అవసరం ఉంది.

You cannot copy content of this page