యూత్ డైవర్షన్ ప్రోగ్రాం…

దండకారణ్యంలో పోలీసుల వ్యూహం

రెండు రాష్ట్రాల్లో జాయింట్ ఆపరేషన్…

దిశ దశ, దండకారణ్యం:

వేళ్లూనుకపోయిన మావోయిస్టుల ఏరివేత కోసం కేవలం కూంబింగ్ ఆపరేషన్లతో సరిపెడితే సరిపోదన్న భావనతో ఆ రెండు రాష్ట్రాల పోలీసు అధికారులు ముందుకు సాగుతున్నారు. దండకారణ్య అటవీ ప్రాంతంలో అప్పర్ హైండ్ గా నిలుస్తున్న మావోయిస్టుల ఎత్తులకు పై ఎత్తులు వేయాలన్న సంకల్పంతో ఇరు రాష్ట్రాల పోలీస్ యంత్రాంగం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్టుగా స్పష్టమవుతోంది.

రిక్రూట్ మెంట్ కు బ్రేక్…

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా, చత్తీస్ గడ్ లోని పూర్వ బస్తర్ జిల్లా అటవీ ప్రాంతాలను మావోయిస్టులు కంచుకోటగా మార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోయిస్టులను ఏరివేసేందుకు రంగంలోకి దిగిన పోలీసు బలగాలను మట్టుబెడ్తూ నక్సల్స్ ఆదిపత్యం చెలాయిస్తున్నారు. దాదాపు దశాబ్దన్నర కాలంగా మావోయిస్టులు ఆయా రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో తిరుగు లేని ఆదిపత్యం చెలాయిస్తున్న సంగతి తెలిసిందే. నక్సల్స్ కు ఆకర్షితులై అడవి బాట పడుతున్న పద్దతికి చెక్ పెట్టాలన్న యోచనతో రెండు రాష్ట్రాల పోలీసు అధికారులు సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. మావోయిస్టులను ఏరివేసేందుకు కూంబింగ్ ఆపరేషన్లు చేపట్టడంతోనే సరిపెట్టడం వరకే పరిమితం కాకుండా అడవి బిడ్డలను అక్కున చేర్చుకునే పనిలో నిమగ్నం కావాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీంతో రెండు రాష్ట్రాల్లోని యువతను ఆకర్షించేందుకు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారనే చెప్పాలి. చత్తీస గడ్ లోని బస్తర్ ఏరియా యువతకు ఉపాధి కల్పించడంతో పాటు నక్సల్స్ ఏరివేత ఆపరేషన్లలో పాలు పంచుకునే విధంగా 2100 మందిని బస్తర్ ఫైటర్స్ గా నియామకం చేసుకుంది అక్కడి ప్రభుత్వం. వీరు రెండు మూడు రోజుల్లో కార్యరంగంలోకి దిగి మావోయిస్టుల కౌంటర్ యాక్షన్ లో పాలు పంచుకోనున్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో కూడా పోలీసు అధికారులు యువతను ఆకర్షించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇక్కడి యువతను తమవైపు తిప్పుకునేందుకు స్పెషల్ ఎఫర్ట్స్ స్టార్ట్ చేశారు. గడ్చిరోలి ఎస్పీ నిలోత్పాల్ నేతృత్వంలో ఇక్కడి యూత్ ను పోలీస్ రిక్రూట్ మెంట్ కోసం ఫిజికల్ ట్రైనింగ్ ఇప్పించడంతో పాటు స్టడీ మెటిరియల్ కూడా అందిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రీ రిక్రూట్ మెంట్ ట్రైనింగ్ ఆరు బ్యాచుల ద్వారా 1079 మందికి శిక్షణ ఇవ్వగా, 820 మంది యువకులు, 259 మంది యవతులు శిక్షణ పొందారు. నెల రోజుల పాటు వీరికి ఫీల్డ్ టెస్ట్, రాత పరీక్షల్లో సుశిక్షుతులను చేశారు. అలాగే 505 మంది యవతకు గడ్చిరోలి పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మోటారు డ్రైవింగ్ ట్రైనింగ్ కూడా ఇప్పించారు. గడ్చిరోలి జిల్లాలోని అహేరీ, భామ్రాఘడ్, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు, జిల్లా నైపుణ్యాభివృద్ది శాఖల సమన్వయంతో జిల్లా పోలీసు అధికారులు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇందులో ట్రైనింగ్ పొందిన వారిలో 85 మంది పోలీసు విభాగంలో ఉద్యోగాలు పొందినట్టు గడ్చిరోలి ఎస్సీ నీలోత్పాల్ ఒక ప్రకటనలో తెలిపారు.

కౌంటర్ చర్యలతోనే సరి…

బందూకులతో సహవాసం చేస్తూ నిత్యం పోరుబాటలో సాగడంతోనే సరిపెట్టకుండా మావోయిస్టులకు ఆదిలోనే చెక్ పెట్టే యోచనలో గడ్చిరోలీ పోలీసు యంత్రాంగం యువత దృష్టిని మరల్చే ప్రయత్నం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించినట్టుగా స్పష్టమవుతోంది. నిరంతరం ఇలాంటి ప్రీ ట్రైనింగ్ సెంటర్లను నిర్వహిస్తూ అక్కడి యువత మావోయిస్టుల వైపు ఆకర్షితులు కాకుండా ఉండేందుకు ముందుకు సాగుతున్నట్టు చత్తీస్ గడ్, మహారాష్ట్ర పోలీసు అధికారుల ఎత్తులు స్పష్టం చేస్తున్నాయి. నక్సల్స్ ఏరివేత కోసం అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టడం వరకే పరిమితమైన జాయింట్ ఆపరేషన్ విధానం ఇప్పుడు మావోయిస్టుల రిక్రూట్ మెంట్ ను నిలువరించే విషయంలోనూ రెండు రాష్ట్రాలు సమన్వయంతో ముందుకు సాగుతున్నట్టుగా ఉంది.

గడ్చిరోలీ జిల్లాలో ట్రైనింగ్ అవుతున్న యువత

You cannot copy content of this page