యువజనోద్యమ నేతకు తీవ్ర అనారోగ్యం…

దిశ దశ, హైదరాబాద్:

యువజనుల్లో నవచైతన్యం నింపేందుకు అవిశ్రాంతంగా శ్రమించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ నుండి శ్రీకాకుళం జిల్లా వరకు యువజనోద్యమాలకు జీవం పోశారు. స్వరాష్ట్ర కల సాకారం కావాలని ఉద్యమంలో  కీలక భూమిక పోషించిన ఆయన తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. అపస్మారక స్థితికి చేరుకున్న ఆయన చికిత్స అందుకుంటున్నారు. నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన జిట్టా బాలకృష్ణారెడ్డి పేరు తెలియని యువత ఉండకపోవచ్చు. దశాబ్దాల క్రితమే యువజన సంక్షేమం కోసం ఉద్యమాలు చేసిన చరిత ఆయనది. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోని నాటి యువతరంతో అనుబంధం పెనవేసుకుని యువజనుల వికాసమే లక్ష్యంగా ముందుకు సాగారు. యువజన సంఘాల సమితిని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా యూత్
క్లబ్స్ ఆవిర్భావం చేయించారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలతో నాటి యువతరంలో సరికొత్త స్పూర్తిని నింపిన జిట్టా బాలకృష్ణారెడ్డి తనదైన ముద్ర వేసుకున్నారు. జాతీయ యువజన అవార్డు గ్రహిత కూడా అయిన జిట్టా బాల కృష్ణారెడ్డి యువజనలను సంఘటీత పర్చిన తీరు ఆదర్శంగా నిలుస్తోంది. స్వామి వివేకానంద బోధనలు అందించడంతో పాటు ఆయన విగ్రహాలను ఏర్పాటు చేయడంలో కూడా ముందువరసలో నిలిచారు.

ఫ్లోరైడ్ పారదోలేందుకు…

ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ గ్రామాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఫ్లోరైడ్ మహమ్మారి బారిన పడ్డ బాధితులను కళ్లార చూసిన జిట్టా బాలకృష్ణారెడ్డి తీసుకున్న చొరవ అంతా ఇంతా కాదు. ప్రతి గ్రామంలో రక్షిత మంచినీటి పథకాలను ఏర్పాటు చేయించిన ఘనత ఆయనది. ఎదిగే బిడ్డలు ఈ వ్యాధి బారిన పడి అచేతనులుగా మారిపోతున్న తీరును చూసి చలించి పోయిన జిట్టా ఫ్లోరైడ్ విముక్తే లక్ష్యంగా ఏర్పాటు చేసిన మంచినీటి పథకాలు ఇప్పటికీ గ్రామాల్లో చెప్పుకుంటుంటారు. మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి తనవంతు బాసటనిచ్చారు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు.

ఉద్యమ శిఖరం…

స్వ రాష్ట్ర కల సాకారం కోసం తెలంగాణ ఉద్యమంలో తనవంతు బాధ్యతలను నిర్వర్తించారు. నల్గొండ జిల్లాకే పరిమితం కాకుండా రాష్ట్రం నలుమూలాల తిరుగుతూ ఉద్యమానికి ఊపిరి పోసిన వారిలో ఆయన ఒకరు. యువజన చైతన్యం కోసం ఊరు వాడ తిరిగిన జిట్టా బాలకృష్ణారెడ్డికి స్వ రాష్ట్ర పోరాటానికి కలిసి వచ్చిందనే చెప్పాలి. ఏ జిల్లాకు వెల్లినా తనతో కలిసి నడిచిన యువతను స్వ రాష్ట్ర ఉద్యమంలో భాగస్వాములను చేయడంలో తనవంతు భూమిక పోషించారు. ఆర్థికపరమైన అంశాల్లో వెనకాడకుండా ఉద్యమంలో అన్ని తానై వ్యవహరించిన
సందర్బాలూ లేకపోలేదు. సాంస్కృతిక కళారూపాల ప్రదర్శనలతో ఉద్యమానికి ఉవ్వెత్తున ఎగిసిపడే విధంగా వ్యవహరించిన వారిలో జిట్టా ఒకరు. తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో తనవంతు పాత్ర పోషించిన ఆయన తెలంగాణ భవన్ లో విగ్రహ ఆవిష్కరణలోనూ ముఖ్యపాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో అంతరించి పోతున్న కళారూపాలకు ఆదరణ కల్పించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సఫలం అయ్యారు. దీంతో ఆయా ప్రాంతాలకే పరిమితం అయిన కళారూపాలను జాతీయస్థాయిలో వెలుగులోకి తీసుకరావడంలో ప్రత్యేక చొరవ తీసుకున్నారు. స్వరాష్ట్ర కలసాకారం అయిన తరువాత ఉద్యమ కారునిగా ఆయనకు ప్రాధాన్యత దక్కలేదన్నది నేటికీ చర్చించుకుంటున్నారు. ఆయనకు తీరని అన్యాయం జరిగిందనే ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీ ఏర్పాటు చేసిన జిట్టా కొంతకాలం తరువాత బీజేపీలో చేరారు. ఆ పార్టీని వీడి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో తిరిగి జాయిన్ అయ్యారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలోని వివిధ ప్రాంతాల మీదుగా ప్రవహిస్తున్న మూసీ నది ప్రక్షాళన కోసం పరివాహక గ్రామాల్లో పక్షం రోజుల పాటు పాదయాత్ర చేపట్టి  అక్కడి ప్రజల గోసను ప్రభుత్వం దృష్టికి తీసుకరాగలిగారు. బీబీనగర్ వద్ద ఎయిమ్స్ మంజూరు అయినప్పటికీ ఏర్పాటు విషయంలో జాప్యం జరగడంతో దాని సేవలు అందించాలని ఉద్యమం చేయడంతో నేడు బీబీ నగర్ ఎయిమ్స్ ద్వారా వైద్య సేవలందుతున్నాయి.

అనారోగ్యంతో…

తీవ్ర అనారోగ్యానికి గురైన జిట్టా బాలకృష్ణారెడ్డి హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన తిరిగి అందరిలో ఒకడిగా రావాలని ఆకాంక్షిస్తున్నారు యువజన సంఘాల ప్రతినిదులు. ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయనపై అభిమానం మాత్రం తగ్గించుకోని ఆయన వెన్నంటి నడిచామని ఆయన క్షేమంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

You cannot copy content of this page