యూట్యూబర్స్ బోనాలు…

యూ ట్యూబ్ ద్వారా ఆదాయాన్ని గడిస్తున్న ఆ కళాకారులంతా తమ జీవితాలకు కొత్త దారి చూపించిన గూగుల్ తల్లిని తల్చుకోవాలనుకున్నారు. మారుతున్న కాలంతో తమ కళలను అక్కున చేర్చుకునే వారెవరూ అని ఎదురు చూస్తున్న క్రమంలో వారికి సరైన ఆదాయ మార్గం దొరికినట్టియింది. యూ ట్యూబ్ వల్ల తమ ఉపాధి మార్గాలు మెరుగు పడడమే కాకుండా తమలోని కళ కూడా అంతరించిపోకుండా పది కాలాల పాటు నిలిచేలా తయారైంది. కళామతల్లిని భావితరాలకు అందించలేమన్న వేదన, ఇంతకాలం నమ్ముకున్న కళకు ఆదరణ లేకుండా పోతున్న సమయంలో వారికి అపద్భంధువుగా కనిపించింది యూ ట్యూబ్. సోషల్ మీడియా వేదికలో యూ ట్యూబ్ కు ఉన్న క్రేజీ అంతా ఇంతా కాదనే చెప్పాలి. యూ ట్యూబ్ ద్వారా మానిటైజెషన్ మొదలైతే రెవెన్యూ కోసం వెంపర్లాడే పరిస్థితి లేకుండా పోతుందన్నది నిజం. గూగుల్ యాడ్ సెన్స్ స్టార్ట్ అయితే చాలు ఉపాధి దొరుకుతుందన్న విషయాన్ని గమనించిన కళాకారులు ఒక్కొక్కరుగా అటువైపుగా పయనించడం మొదలు పెట్టారు. మిలియన్లలో వ్యూస్, లక్షల్లో సబ్ స్క్రైబర్స్ యూ ట్యూబ్ ఛానెల్స్ ను ఆదరిస్తుండడం, యాడ్స్ ద్వారా రెవెన్యూ వస్తుండడంతో కళాకారులు బృందాలుగా ఏర్పడి తమ ఉపాధి మార్గాన్ని ఎంచుకుని ముందుకు సాగుతున్నారు. వందల సంఖ్యలో ఛానెల్స్ ఏర్పాటు చేసుకుని తమ కుటుంబాలనే కాకుండా తమపై ఆధారపడ్డ వారికి కూడా ఆర్థికంగా అండదండలు అందిస్తున్నారు.

జానపదానికి కేరాఫ్…

జానపదానికి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో యూట్యూబర్ల సంఖ్య పెద్ద సంఖ్యలోనే ఉందని చెప్పొచ్చు. తమ కల్చర్ కు సంబందించిన కళలే కావచ్చు ఇతర రంగాలకు సంబందించిన కళలనే కావచ్చు ప్రదర్శించి వీడియో రికార్డు చేసి యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేయడంతో ప్రేక్షకులు ఆదరణ విపరీతంగా పెంచుకుంటున్నారు. అన్ని తరాల వారి నుండి క్రేజీ సంపాదించుకుంటున్న యూ ట్యూబర్స్ కు గూగుల్ ద్వారా లక్షల్లోనే ఆదాయం వస్తుండడం విశేషం. ట్రెండింగ్ వీడియోలను అప్ లోడ్ చేసి ప్రేక్షకాదరణ పొందుతుండడంతో కళాకారులు అంతా కూడా ఆనందమైన జీవితం గుడుపుతున్నారు.

తల్లిని తల్చుకుంటూ..

సాధారణంగా తెలంగాణాలో పూర్వ కాలం నుండి ఓ ఆచారం ఉంది. తమ కోర్కెలు తీర్చే దేవుళ్లకు ఏడాదికి ఓ సారి బోనాలు సమర్పించుకుంటుంటారు. పెద్ద ఎత్తున జరిగే బోనాల జాతరలు తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువగా ఉంటాయి. ఇదే విధానంతో తమకు ఉపాధి మార్గాన్ని చూపించిన గూగుల్ తల్లిని కూడా తల్చుకోవాలని భావించారు యూ ట్యూబర్స్. ఇందులో భాగంగా గూగుల్ తల్లికి బోనాలు సమర్పించాలని భావించి దక్షిణ కాశీగా భాసిల్లుతున్న వేములవాడ రాజన్న క్షేత్రాన్ని ఎంచుకున్నారు. మాఘ పౌర్ణమి రోజైన ఫిబ్రవరి 5న తెలంగాణాలోని వివిధ ప్రాంతాల్లోని యూ ట్యూబర్స్ అంతా కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. రాజన్న సన్నిధిలోని అమరవీరుల స్థూపం నుండి బద్దిపోచమ్మ తల్లి ఆలయం వరకు భారీ ర్యాలీ చేపట్టి అంగరంగ వైభవంగా బోనాలు సమర్పించారు. ఎక్కడా కూడా లేని విధంగా, కనివినీ ఎరగని రీతిలో యూ ట్యూబర్స్ అంతా కలిసి జోగినీలను కూడా పిలిపించి బోనం సమర్పించే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యూ ట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన నటీనటులు, రచయితలు, గాయకులు, టెక్నికల్ స్టాఫ్, మ్యూజిక్ డైరక్టర్లు, వీడియో గ్రాఫర్స్ ఇలా అన్ని రంగాలకు సంబందించిన వారంతా వేములవాడకు చేరుకుని గూగుల్ తల్లికి బోనాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. అత్యంత వైవిద్యంగా సాగిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది.

యూ ట్యూబర్స్ బోనాలు కార్యక్రమంపై వారేమంటున్నారంటే…? ఈ లింక్ పై క్లిక్ చేయండి

https://youtu.be/TMb09Gz_Yvo

You cannot copy content of this page