సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు

తెలంగాణలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మౌన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఆమెను బొల్లారం పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ట్యాంక్ బండ్‌పై ఉన్న రాణి రుద్రమ దేవి విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి.. నోటికి నల్ల రిబ్బెన్లు కట్టుకుని వైఎస్‌ షర్మిల దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువు అయిందని షర్మిల విమర్శించారు.

రాష్ట్రంలో ఒక్క కవితకు తప్ప ఎవరికి రక్షణ లేదని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం అత్యాచారాలు, మహిళల కిడ్నాప్ విషయంలో మొదటి స్థానంలో ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతి ఏడాది సుమారు 20వేల మంది అత్యాచారానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని షర్మిల మండిపడ్డారు. కేసీఆర్‌కు ఆడవాళ్ల పట్ల వివక్ష ఉందని ఆరోపించారు.

తెలంగాణలో 33 శాతం రిజర్వేషన్ ఎక్కడ అమలవుతుందో చూపాలని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. ఏకంగా గవర్నర్‌నే అసభ్య పద జాలంతో దూషించారని షర్మిల కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మహిళలకు రాష్ట్రంలో గౌరవం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ఏడాదిలో మహిళా దినోత్సవం రాగానే మహిళలు గుర్తొచ్చారని వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పి.. మూడేళ్లుగా దాదాపు నాలుగు వేల కోట్ల బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు. రాష్ట్రంలోని 46.10లక్షల మంది మహిళా సంఘాల సభ్యులను కేసీఆర్ మోసం చేశారని ట్వీట్ చేశారు.

కేసీఆర్ తీరుతో మహిళలే ఆపసోపాలు పడి, బ్యాంకర్లకు వడ్డీలు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందని షర్మిల మండిపడ్డారు. మహిళల పట్ల కేసీఆర్‌కు నిజంగానే ప్రేమ ఉంటే పూర్తిగా 4వేల కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 750 కోట్లకు కేటీఆర్ కృతజ్ఞత చెప్పడం మానేసి… కేసీఆర్ వద్ద బకాయిలు వసూలు చేయించాలని సూచించారు.

You cannot copy content of this page