బీఆరెఎస్ పై రోజుకో సెటైర్…
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర వైవిద్యంగా సాగుతోంది. రాష్ట్రం అంతా పాదయాత్రతో మెట్టినింటి బిడ్డగా, రాజన్న కూతురిగా ఆదరించాలని కోరుతూ తెలంగాణ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఉత్తర తెలంగాణాలో పర్యటిస్తున్న షర్మిల ఒక్కో చోట ఒక్కో పంచ్ డైలాగ్ విసురుతూ అధికార పార్టీని ఇరుకున పెట్టేస్తున్నారు.
బీఆరెఎస్ పై…
టీఆరెఎస్ ను జాతీయ పార్టీగా అప్ గ్రేడ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై వ్యంగ్యాస్త్రాలు విసరుతున్నారు. మొదట బీఆరెఎస్ అంటే బార్ అండ్ రెస్టారెంట్ సమితీ అని కామెంట్ చేసిన షర్మిల తాజాగా చేసిన కామెంట్ సంచలనంగా మారింది. శుక్రవారం పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తున్న ఆమె బీఆరెఎస్ కు సరికొత్త భాష్యం చెప్పారు. బీఆరెఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇంతకు ముందు జగిత్యాల జిల్లా ముత్యంపేట చక్కర ఫ్యాక్టరీని సందర్శించినప్పుడు మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. వంద రోజుల్లో తెరుస్తానని చెప్పిన కేటీఆర్ ముందు ఈ షుగర్ ఫ్యాక్టరీని తెరింపించేందుకు చొరకవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ హక్కు ఆంధ్రలు హక్కు అంటూ నినదించడం పక్కనపెట్టి ముందుగా ముత్యంపేట చెరుకు రైతుల గోడు పట్టించుకోవాలని హితవు పలికారు.
అవకాశాన్ని అంది పుచ్చుకుంటూ…
తన పాదయాత్రలో అందివచ్చిన అవకాశాన్ని వదులకోకుండా వ్యూహాత్మకంగా సాగుతున్నారు. శనివారం రామగుండంలో ప్రధాని పర్యటన ఉండగా శుక్రవారం షర్మిల రామగుండం, మంథని నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగించారు. ఓ వైపున ప్రదాని మోడీ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రధానికి బహిరంగ లేఖ రాస్తూ కాళేశ్వరంలో జరిగిన లక్ష కోట్ల అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు అవినీతిపై విచారించేందుకు కమిషన్ వేయాలని, వాస్తవాలను దేశ ప్రజల ముందు ఉంచాలన్నారు. అంతేకాకుండా వాల్ పోస్టర్ల ద్వారా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ ఎక్కడా అన్న ప్రశ్న సంధించారు. మరో వైపున ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని టూర్ కు దూరంగా ఉండడాన్ని కూడా తప్పు పట్టారు. ప్రధాని పర్యటనలో పాల్గోని రాష్ట్రానికి రావల్సిన సాయం విషయంలో అడిగేందుకు ఎందుకు చొరవ తీసుకోవడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రతి చోట ఎలాంటి అవకాశం ఉన్నా అటు బీజేపీ, ఇటు టీఆరెఎస్ పార్టీని ఏకి పారేస్తున్నారు.