దిశ దశ, ఏపీ బ్యూరో:
వైఎస్సార్ తనయ షర్మిల పయనం ఎటు వైపు సాగనుంది? తెలంగాణలో వైఎస్సార్టీపీ పేరిట కార్యకలపాలు కొనసాగించినప్పటికీ అనుకున్నంత సానుకూలత అందుకోలేకపోయారు. యాత్రలు చేపట్టినప్పటికీ ఫలితం కనిపించలేదు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసినప్పటికీ బరిలో అభ్యర్థులను నిలబెట్టలేకపోయారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీ రోల్ గా వ్యవహరించాలని భావించినప్పటికీ ఆమె ప్రయత్నాలకు బ్రేకులు పడ్డాయి. ఏపీకి చెందిన వైస్ షర్మిల తెలంగాణాలో రాజకీయాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. అయితే తన మెట్టినిల్లు తెలంగాణలోనే ఉందని వాదించినా ఫలితం లేకుండా పోయింది. ఏపీలో ఎన్నికల కొలహాలం మొదలైన నేపథ్యంలో మళ్ళీ తెరపైకి షర్మిల పేరు వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత ఆమెకు ఆ రాష్ట్ర పార్టీ పగ్గాలు ఇస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఆమెను ఏపీ పాలిటిక్స్ లోకి రాకుండా నిదువరించేందుకు పావులు కదుపుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సన్నిహితుల ద్వారా రాయబారం మొదలు పెట్టినట్టు సమాచారం. అయితే వైఎస్ షర్మిల మాత్రం ససేమిరా అంటున్నట్టుగా తెలుస్తోంది. తాను ఏపీ రాజకీయాల్లో ఖచ్చితంగా ఉంటానని, ఉనికిని చాటుకుని తీరుతానని కూడా తేల్చి చెప్తున్నట్టు సమాచారం. దీంతో షర్మిల ఏపీ రాజకీయాల్లోకి రావడం ఖాయమని స్పష్టం అవుతోంది. అయితే ఆమెను మెప్పించి ఒప్పించేందుకు సిఎం జగన్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఆమె కూడా ఈ ఎన్నికల్లో ప్రచారానికి తిరిగినట్టయితే వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకుకు గండి పడుతుందని భావిస్తున్నారు. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాల్లో షర్మిల కేంద్ర బిందువుగా మారారు.