జూమ్‌లో అరగంటలో 1,300మంది ఉద్యోగుల తొలగింపు

ఆర్థిక మాంద్యం కారణంగా ప్రముఖ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుంది. తాజాగా ఈ జాబితాలోకి మరో కంపెనీ చేరింది. వీడియో కాన్ఫరెన్సింగ్ సేవలు అందించే సంస్థ జూమ్ సైతం లేఆఫ్స్ కంపెనీల జాబితాలో చేరింది. తమ వర్క్‌ ఫోర్స్‌లో 1,300 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ సీఈవో ఎరిక్ యువాన్ ఒక బ్లాగ్ పోస్ట్ చేశారు. తొలగిస్తున్న ఉద్యోగులకు 30 నిమిషాల్లో మెయిల్‌ ద్వారా సమాచారం అందిస్తామని వెల్లడించారు.

కరోనా సమయంలో ఇంటి దగ్గర నుంచి పనిచేసే వారు ఎక్కువైన నేపథ్యంలో డిమాండ్‌కు తగ్గట్లుగా ఎక్కువ మందిని నియమించుకోవాల్సి వచ్చిందని జూమ్ సీఈవో ఎరిక్ యువాన్ తెలిపారు. కాగా, ఇప్పుడు కొందరిని తొలగించక తప్పట్లేదని వివరించారు. డిమాండ్‌ను అందుకోవడానికి 24 నెలల వ్యవధిలో ఉద్యోగులను మూడు రెట్లు ఎక్కువగా నియమించుకున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పట్లో అలా కొనసాగడం కష్టమని చెప్పారు. సంస్థ దీర్ఘకాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.

కష్టపడి పనిచేస్తున్న, ప్రతిభావంతులైన 1,300 మంది ఉద్యోగులకు గుడ్‌బై అంటూ భావోద్వేగ పూరిత లేఖ రాశారు. ఉద్యోగం కోల్పోయిన వారందరికీ 30 నిమిషాల్లో మెయిల్స్ వస్తాయని, ఈ విధంగా సమాచారం అందిస్తున్నందుకు తనను క్షమించాలని కోరారు.

మరోవైపు కంపెనీ ఖర్చును తగ్గించేందుకు జూమ్ సీఈవో ఎరిక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తన వేతనంలో ఏకంగా 98 శాతం కోత విధించుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితికి జవాబుదారీగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 2023లో కార్పొరేట్ బోనస్‌ను కూడా వదులుకుంటున్నానని స్పష్టం చేశారు. ఇంకా ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్‌ టీమ్ సైతం తమ కనీస వేతనాలను 20 శాతం మేర తగ్గించుకుంటున్నాయని చెప్పారు. ఇక ఉద్యోగం కోల్పోయిన వారు యూఎస్‌లో ఉన్నట్లయితే వారికి 16 వారాల వేతనం, హెల్త్‌కేర్ కవరేజీ, యాన్యువల్ బోనస్ అందుతాయని తెలిపారు.

You cannot copy content of this page