పాలించిన దేశానికి పాలకుడై రికార్డు…
సరిగ్గా 45 రోజుల క్రితం అందకుండా పోయిన పదవే నేడు అతన్ని వరించింది. ఒక్క అడుగుతో కీలకమైన పదవిలో కూర్చోవల్సిన ఆ వ్యక్తినే పిలిచి మరీ కూర్చోబెట్టారు అక్కడి ప్రతినిధులు. పోటీలో ఓటమి చవి చూసినా ఏకగ్రీవంగా ఆయన్ని వెతుక్కుంటూ ముందు వాలిపోయింది. మెజార్టీ సాధించిన వ్యక్తి అనూహ్య పరిణామాలతో కూర్చిని వదలాల్సి రావడంతో భారత సంతతిని వరించిందా పదవి. మాతృ దేశాన్ని పాలించిన దేశానికే పరిపాలకునిగా ఎన్నికై సరికొత్త రికార్డు సృష్టించారు. దీపావళి పర్వ దిన వేళ దేశమంతా టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటుంటే తీపి కబురు విన్న భారతీయలు ఆనందంలో తేలియాడుతున్నారు.
యూ కె ప్రదానిగా మన బిడ్డే…
లిజ్ ట్రస్ రాజీనామాతో బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారోనన్న ఉత్కంఠకు తెరపడింది. బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెన్నీ మోర్డాంట్ పోటీ నుండి వైదొలగడంతో రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికయి బ్రిటన్ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామాతో నెలకొన్న సంక్షోభాన్ని నిలువరించేందుకు టోరీ సభ్యులు ఈ సారి రిషి వైపు మొగ్గు చూపారు. భారత సంతతికి చెందిన ఆయనే యూకెలో నెలకొన్న సంక్షోభం నుండి గట్టెక్కించగలరని విశ్వసించి రిషీ సునాక్ కు పట్టాభిషేకం చేసేశారు. 45 రోజుల క్రితం లిజ్‌ట్రస్ చేతిలో ఓటమిపాలైన సునాక్ అనూహ్య పరిణామాలతో బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. యూనైటెడ్ కింగ్ డమ్ పాలనా పగ్గాలు అందుకున్న తొలి భారత సంతతికి చెందిన వ్యక్తిగా రిషి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. మొత్తం 357 మంది టోరీ ఎంపీల్లో సగం మందికి పైగా రిషి సునాక్ (42)కు మద్దతు ప్రకటించారు. అంతేకాకుండా బ్రిటన్ లో అత్యంత చిన్న వయసులో ప్రధాని పీఠం అధిష్టించిన అరుదైన రికార్డు కూడా రిషీ సొంతం చేసుకోవడం అభిందనీయమనే చెప్పాలి. కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా తనకు చట్టసభ సభ్యుల మద్దతు ఉన్నప్పటికీ రిషి సునాక్ కంటే వెనకబడి ఉన్నానని గ్రహించిన బోరిస్ జాన్సన్ పోటీ నుండి వైదొలుగుతున్నట్టు ప్రకటించడంతో రిషీ సునాక్ ఏకగ్రీవ ఎన్నికకు మార్గం సుగమం అయింది. కీలక నేతగా ఉన్న బోరిస్ పోటీ నుంచి తప్పుకోవడం మరో అభ్యర్థి పెన్నీ మోర్డాంట్‌కు మద్దతు అంతగా లేకపోవడంతో బ్రిటన్ తదుపరి ప్రధానిగా రిషి సునాక్ విజయం దాదాపు ఖాయమైనట్టేనన్న వార్తలు మధ్యాహ్నం నుండే వెలువడ్డాయి. చివరకు ప్రధాని రేసు నుండి పెన్నీ మోర్డంట్ కూడా వైదొలగడంతో రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికై రికార్డు సృష్టించారు.
ఎవరీ సునాక్… ఏమా కథ..?
1960లో తూర్పు ఆఫ్రికా నుండి యూకెకు రిషీ సునాక్ కుటుంబం వలస వచ్చింది. సౌతంప్టన్ లో పెరిగిన రిషీ తల్లి దండ్రులు భారత సంతతికి చెందిన వారు. కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఫుల్‌బ్రైట్ స్కాలర్‌గా ఎంబీఏ పూర్తి చేయగా అంతకు ముందు ఆక్స్‌ఫర్డ్‌లోని లింకన్ కాలేజీలో తత్వశాస్త్రం, రాజకీయాలు, ఆర్థికశాస్త్రం (పీపీఈ) కంప్లీట్ చేశారు. ఇన్ఫోసిస్ స్థాపించిన భారతీయ వ్యాపారవేత్త నారాయణ మూర్తి కుమార్తె అయిన అక్షతా మూర్తిని రిషి సునక్ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు పరిచయం ఏర్పడడంతో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. రిషి సునక్ దంపతులిద్దరూ బ్రిటన్‌లో 222,243వ ధనవంతులుగా జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. 2015 సాధారణ ఎన్నికల్లో సునక్ హౌజ్ ఆఫ్ కామన్స్‌లో నార్త్ యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్ ప్రతినిధిగా వ్యవహరించారు. 2018 క్యాబినెట్ షేక్ అప్‌లో పార్లమెంటరీ అండర్-సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా ఎంపికయ్యారు. కన్జర్వేటివ్ పార్టీకి నాయకత్వం వహించిన బోరిస్ జాన్సన్ సునక్ మద్దతు ఇచ్చారు. COVID-19 మహమ్మారి సమయంలోనూ, ఆర్థిక సంక్షోభం గట్టెకించే ప్రయత్నాల్లో సునక్ పాత్ర కీలకమైందని అక్కడి మీడియా వర్గాలు చెప్తున్నాయి.
చుట్టు ముట్టిన వివాదాలు…
బ్రిటన్ ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికైన రిషి సునాక్ ను వివాదాలు చుట్టుముట్టాయి. చిన్నచిన్న వివాదాల్లో ఆయన పేరు వినిపించడం గమనార్హం. ముఖ్యంగా ఆయన భార్య అక్షితా మూర్తి లక్ష్యంగా చేసుకుని సునాక్ ప్రత్యర్థులు విమర్శలకు దిగుతుంటారు. రిషీ సంపన్నవర్గానికి చెందిన వ్యక్తిగా ముద్రవేసేందుకు ప్రత్యర్థులు తరచూ హైలెట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. 2001లో ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ సునక్ లక్ష్యంగా ఆరోపణలు సంధిస్తున్నారు.‘మిడిల్‌క్లాస్ రైజ్ అండ్ స్ప్రోల్’ డాక్యూమెంటరీలో మాట్లాడుతూ తనకు రాచ కుటుంబీకులు, ఉన్నత వర్గాల వారే మిత్రులుగా ఉన్నారని ప్రకటించారు. తనకు వర్కింగ్ క్లాస్‌లో మిత్రులు లేరని కూడా సునాక్‌ను చెప్పిన ఈ వీడియో క్లిప్ ను ప్రత్యర్థులు ఆయుధంగా వాడుకుంటూ ఆయన సామాన్య ప్రజల మనిషి కాదని వ్యాఖ్యానిస్తుంటారు. ఆయన భార్య అక్షితామూర్తి నివాస హోదా విషయంలోనూ వివాదం చెలరేగింది. ఈ ఏడాది ఆమె 30,000 పౌండ్లు చెల్లించి తన నాన్-డొమిసిల్ హోదాను ఏడాది పాటు పొడిగించుకొన్నారని, యూకేలో పన్నులు ఎగ్గొట్టేందుకే ఈ హోదాను వాడుకొంటున్నారని సునాక్ ప్రత్యర్థులు ఆరోపించారు. దీంతొ అక్షితా మూర్తి కూడా స్పందిస్తూ ‘నా పన్ను హోదా నా కుటుంబ సభ్యులకు ఇబ్బందిగా మారకూడదని భావిస్తున్నాను. ఇకపై ప్రపంచ వ్యాప్తంగా లభించే ఆదాయంపై యూకేలో కూడా పన్ను చెల్లిస్తానని ప్రకటించారు’. ఉక్రెయిన్‌పై యుద్దం ఆరంభమైన సమయంలో రష్యాలో పెట్టుబడులను షెల్, బ్రిటిష్ పెట్రోలియం కంపెనీలు నిలిపివేయడాన్నిసునాక్ అభినందించారు. అయితే అక్షితా మూర్తి మాత్రం ఇన్ఫోసిస్ సొమ్ము తీసుకొంటున్నారని, ఆ కంపెనీ రష్యాలో కార్యకలాపాలు కొనసాగిస్తోందన్న విమర్శలు ఎదుర్కొవల్సి వచ్చింది. ఇన్ఫోసిస్ సంస్థ రష్యాలో తన కార్యకలాపాలు నిలిపివేసేందుకు నిరాకరించిందని విమర్శించే వారూ లేకపోలేదు. సునాక్ బీబీసీ బ్రేక్‌ఫాస్ట్ షోలో పాల్గొన్న సమయంలో మీరు ఎటువంటి బ్రెడ్‌ను ఇష్టపడతారని వ్యాఖ్యాత ప్రశ్నించగా తమ ఇంట్లో చాలా రకాల బ్రెడ్‌లు ఉంటాయని… తాను, తన భార్య ఆరోగ్య అవసరాలకు తగినట్లుగా వినియోగిస్తామని వివరించారు. ఈ సమాధానం కూడా ప్రత్యర్థులకు ఆయుధంగా మారిపోయింది. షాడో ఫుడ్ సెక్రటరీ జిమ్ మెక్‌మోహన్ మాట్లాడుతూ ఒక్క రొట్టెకొనడానికి ఛాన్స్‌లర్ కష్టపడి ఉంటే రిషీ ఆయా కుటుంబాలకు మద్దతు ఇచ్చేవాడని విమర్శించారు.
భారత్ లో సంబరాలు…
బ్రిటన్ అత్యున్నత పదవిని అలంకరించిన రిషీ సునక్ భారత సంతతికి చెందిన వారు కావడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. అంతర్జాతీయ పరిణామాల్లో చోటు చేసుకున్న ఈ మార్పు భారత దేశ గొప్పతనాన్ని మరింత పెంచినట్టయింది.