అన్నల ఇలాకాలో సీఎం షిండే…

భామ్రాగడ్ లో దీపావళి

మావోయిస్టుల ఇలాకాలో ఆ ముఖ్యమంత్రి పర్యటించారు. దీపావళి వేడుకల్లో పాల్గొన్న ఆయన అక్క్డడి గిరిజనులతో మమేకం అయ్యారు. నక్సల్స్ కు పెట్టని కోటగా ఉన్న కీకారణ్యాల్లో సీఎం పర్యటించడం సంచలనంగా మారింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు గడ్చిరోలి జిల్లా భామ్రాగడ్ తాలుకాలో మంగళవారం పర్యటించారు. చత్తీస్ గడ్ లోని దండకారణ్య అటవీ ప్రాంతానికి ఇంద్రావతి నదికి ఇవతల ఉన్న భామ్రాగడ్ ఏరియాలో షిండే పర్యటించడం గమనార్హం. మావోయిస్టులకు తిరుగులేని పట్టున్న ఈ ప్రాంతంలో టూర్ చేయడం అత్యంత సాహసంతో కూడుకున్నదేనని చెప్పాలి. మావోయిస్టులు, పోలీసుల మధ్య ప్రచ్ఛన్న యుద్దం ఈ ప్రాంతంలోనే ఈ ఏరియాలోనే జరుగుతుంటుంది. బలగాల కూంబింగ్ తో అడవులను జల్లెడ పడ్తుంటే వారి ఎత్తులకు పై ఎత్తు వేస్తూ మావోయిస్టులు ముందుకు సాగుతుంటారు. మావోయిస్టుల కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంలో పర్యటించిన ముఖ్యమంత్రి షిండే దోదరాజ్ లో పోలీసు సహాక్ష్ కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసును ప్రారంభించారు. భామ్రాగడ్ ఏరియా గిరిజనులు, పోలీసు బలగాలతో షిండే దీపావళి జరుపుకున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు తమ కుటుంబాలకు దూరంగా జీవనం సాగిస్తున్నారన్నారు. వీరితో కలిసి దీపావళి జరుపుకోవడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. నక్సలిజాన్ని అణిచివేయగల సామర్థ్యం పోలీసు బలగాలకు ఉందని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నొక్కి చెప్పారు. గతంలో తాను కేబినెట్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో పర్యటించానని వెల్లడించారు. గడ్చిరోలి జిల్లాను అన్నింటా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నామన్నారు. మారుమూల అటవీ ప్రాంతాల్లో అభివృద్దితో వెలుగులు నింపేవిధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలీసులకు అండగా తమ ప్రభుత్వం ఉంటుందని, గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు సామాన్యుల క్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని షిండే స్ఫష్టం చేశారు. గతంలో ఉన్న గడ్చిరోలికి నేటి గడ్చిరోలికి ఎంతో మార్పు ఉందని ఇక్కడ కొత్త పరిశ్రమలు నెలకొల్పడంతో పాటు ఇక్కడి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రజనీష్ సేథ్, కలెక్టర్ సంజయ్ మీనా, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సందీప్ పాటిల్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నీలోత్పాల్ లు హాజరయ్యారు.

You cannot copy content of this page