రెండు ఏటీఎం కేంద్రాల్లో డబ్బు గల్లంతు కావడం కలకలం సృష్టిస్తోంది. సంగారెడ్డి జిల్లా కందిలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం కల్గిస్తోంది. రెండు ఏటీఎంలలో కలిపి సుమారు రూ. 30 లక్షలు మాయం అయినట్టుగా తెలుస్తోంది. నగదు గల్లంతు వెనక ఇద్దరు క్యాష్ అప్ లోడర్స్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇద్దరు కలిసి రూ.30 లక్షలకు పైగా నగదును ఏటీఎమ్ లలో లోడ్ చేసిన తరువాత ఏజెన్సీ ప్రతినిధులకు డబ్బులు పెట్టినట్లు ఓటీఫీ వెళ్లింది. ఏజెన్సీ ప్రతినిధులు నిర్దారించుకున్న తరువాత ఏటీఎం క్యాష్ అప్ లోడర్స్ తిరిగి ఏటీఎంల నుండి డబ్బులు తీసుకుని ఉంటారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీకి ఎలాంటి ఓటీపీ వెళ్లకుండానే డబ్బులు మాయమవడం వెనక ఏం జరిగి ఉంటుందన్న చర్చ సాగుతోంది. కందిలోని ఏటీఎంలలో డబ్బులు ఎలా మాయమయ్యాయని అప్ లోడర్స్ ను ఏజెన్సీ ప్రతినిధులు ప్రశ్నించగా తాము డబ్బులు లోడ్ చేశామని తమకేమీ తెలియదని బదులిచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే రూ.30లక్షలు గల్లంతయినట్టు పోలీసులకు ఫిర్యాదు అందడంతో సంగారెడ్డి రూరల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. క్యాష్ అప్ లోడర్స్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఇలాంటి అక్రమాలకు తెర దింపేందుకు సాంకేతికతను అందిపుచ్చుకున్న ఏజెన్సీలో ఏటీఎంలలో డబ్బులు పెట్టినా తీసినా ఓటీపీ వచ్చే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల అక్రమాలకు తావు ఉండదని భావించినప్పటికీ డబ్బు మాయం అవడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. గల్లంతు చేసిన వారు టెక్నికల్ గా చిక్కకుండా డబ్బును ఎలా డైవర్ట్ చేశారన్నదే పజిల్ గా మారింది. సాంకేతికంగా ఉన్న లోపాలను ఆసరగా తీసుకున్నారా లేక మరేదైనా టెక్నిక్ ఉపయోగించారా అన్న విషయంపై ఆరా తీస్తున్నట్టు సమాచారం.