మునుగోడు ఓటరు మదిలో ఏముందో..?

మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానున్న పోలింగ్ ప్రక్రియ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన పార్టీల అభ్యర్థులు అంచనాలు వేసుకునే పనిలో నిమగ్నం అయ్యారు. దాదాపు నెల రోజుల పాటు జరిగిన ప్రచార పర్వానికి తెర పడడంతో ఓటర్లను మచ్చిక చేసుకునే బ్యాచులు ఇంటింటికి వెల్లి వ్యక్తిగత ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తుండగా మరి కొంత మంది ఏ మండలంలో తమకు అనుకూలంగా ఉంది, ఏ మండలంలో ప్రత్యర్థి పార్టీకి వ్యతిరేకత ఉంది అన్న అంచనాల్లో తలమునకలయ్యారు.

అక్కడ మాకే…

మునుగోడు నియోజకవర్గంలో ఉన్న మండలాల్లోని గ్రామాల వారిగా ఓటర్ల నాడి ఎలా ఉంది అన్న అంచనాలు వేసే పనిలో నిమగ్నం అయ్యారు. అయితే క్షేత్ర స్థాయిలో తిరిగిన నాయకులు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ తో టీఆరెఎస్, బీజేపీ, కాంగ్రెస్ తో పాటు ఇతర అభ్యర్థులు లెక్కలు వేయడం ఆరంభించారు. ఏ ప్రాంతంలో అయితే తమకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా తెలియగానే ఆ ప్రాంతానికి చెందిన నేతలతో ముచ్చటించి పరిస్థితిని చక్కదిద్దే పనిలో నిమగ్నం అయ్యారు. ఓటర్లు కాని వారంతా కూడా మునుగోడు నియోజకవర్గంలో ఉండరాదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిన నేపథ్యంలో సమీప గ్రామాల్లో డెన్ లు ఏర్పాటు చేసుకున్న ముఖ్య నాయకులు తమ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.

ప్రధాన పార్టీల పరిస్థితి…

ఇక్కడ జరుగుతున్న ఉప ఎన్నికల్లో ప్రధాన పోటీ మాత్రం బీజేపీ, టీఆరెఎస్, కాంగ్రెస్ మధ్యేనని స్పష్టం అవుతోంది. మూడు పార్టీల అభ్యర్థుల ప్లస్ లు, మైనస్ లపై ఓ నిర్ణయానికి వచ్చిన మునుగోడు ఓటర్లు ఎవరిపై ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో తెలుసుకుందాం. ‘‘ సీల్డ్ కవర్ల పంచాయితీ ఇక్కడ కూడా వెలుగులోకి వచ్చింది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు రూ. 3 వేల చొప్పున ఇచ్చారన్న ప్రచారం తీవ్రంగా జరుగుతోంది. అయితే హుజురాబాద్ బై పోల్స్ లో రూ. 6 వేల చొప్పున ఇస్తే, ఇక్కడ 3 వేల ఇచ్చారన్న చర్చ జరుగుతోంది. కొన్ని గ్రామాల్లోని వారయితే తమకు డబ్బులు రాలేదని, తులం బంగారం ఇస్తానని ఇవ్వలేదంటూ నిరసనలు వ్యక్తం చేయడం కూడా గమనార్హం. దీని ప్రభావం ఆ పార్టీపై తీవ్రంగా పడే ప్రమాదం లేకపోదని స్పష్టం అవుతోంది. హుజురాబాద్ బై పోల్ సమయంలో కూడా ఇక్కడి ఓటర్లు నిరసన తెలపడమే కాకుండా స్థానిక నాయకులపై దుమ్మెత్తి పోశారు. మునుగోడులో కూడా ఇదే పరిస్థితి రిపిట్ కావడం గమనార్హం. అభివృద్ది విషయంలో అన్ని పార్టీలు ఫెయిల్ అయ్యాయన్న అభిప్రాయంతో ఇక్కడి ఓటర్లు ఉన్నారు. టీఆరెఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి ఇక్కడి నుండి ఓ సారి ఎమ్మెల్యేగా గెలిచి విఫలం అయ్యారని, రాజగోపాల్ రెడ్డి కూడా మూడేళ్లలో పట్టించుకోలేదన్న అపవాదును మూటగట్టుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి గోవర్దన్ రెడ్డి కూడా గతంలో ఇక్కడి నుండి ప్రాతినిథ్యం వహించినప్పటికీ ఎలాంటి అభివృద్ది జరగలేదన్న వేదన ఇక్కడి ఓటర్లలో నెలకొంది. కమ్యూనిస్టులు కూడా పట్టించుకోలేదన్న వాదన కూడా వినిపిస్తోంది. అభ్యర్థుల వ్యక్తిగత ఇమేజ్ విషయంలో మిశ్రమ స్పందనే కనిపిస్తుండడం గమనార్హం. తమ బలబలాలను నిరూపించుకునేందుకు కీలకమైన ఎన్నికలుగా పొలిటికల్ పార్టీలు భావిస్తున్నాయి కానీ మునుగోడు ఓటర్లు మాత్రం ఈ సారైనా తమ తల రాతలు మారుతాయా లేదా అన్న అనుమానంతోనే ఉన్నారు. ప్రలోభాలు ప్రభావితం చేసే అవకాశం ఉన్నప్పటికీ ఓటరు మనోగతం మాత్రం ముగ్గురిపైనా ఒకేరకమైన అభిప్రాయాన్ని వ్యక్తి కరిస్తుండడం గమనార్హం.

You cannot copy content of this page